News

ఆ సంతకం నాదే..వసుంధర రాజే


ఐపిఎల్ మాజీ బాస్ లలిత్ మోడీ ఇమిగ్రేషన్ అప్పీలును బలపరుస్తూ నాలుగేళ్ల క్రితం అఫిడవిట్‌పై సంతకం చేసింది తానేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే పార్టీ నేతల ముందు అంగీకరించినట్టుగా తెలిసింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని ఆమెను బిజెపి అధినాయకత్వం ఆదేశించే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు కారణం..వ్యక్తిగత హోదాలోనే లలిత్ మోడీ ఇమిగ్రేషన్ అప్పీలును వసుంధర ధ్రువీకరించారే తప్ప అప్పటి రాజస్థాన్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకురాలి హోదాలో కాదని స్పష్టం చేశాయి. వసుంధర సంతకంతో ఉన్న ఏడు పేజీల డాక్యుమెంట్‌ను కాంగ్రెస్ పార్టీ బుధవారం బహిర్గతం చేసిన నేపధ్యంలో బిజెపి నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఆ డాక్యుమెంట్‌ను పార్టీ నాయకత్వం కూలంకషంగా పరిశీలించిందని, దీనిపై తదుపరి వివరాలను రాజే నుంచి సేకరిస్తోందని చెబుతున్నారు. మొదట్లో అసలు లలిత్ మోడీ ఇమిగ్రేషన్ పత్రాలను బలపరిచిన విషయమే తనకు తెలియదని చెప్పిన రాజే అనంతర పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్గాల ముందు వాస్తవాన్ని అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పుకోవాల్సిందిగా వస్తున్న కథనాలను రాజే తిరస్కరించారు. అసలు ఇంత వరకూ అధినాయకత్వం రాజీనామా చేయాలని కోరలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. తనకు వంద మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఒక వేళ తనను తొలగిస్తే రాజస్థాన్‌లో బిజెపి చీలిపోతుందని తనను ఉటంకిస్తూ వచ్చిన వార్తల్ని కూడా ఆమె ఖండించారు. ఇదిలా ఉండగా, అసలు బిజెపిలో కళంకితులెవరూ లేరంటూ విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఎవరూ రాజీనామా చేసే ప్రసక్తి కూడా లేదని ఆయన చెప్పడంపై కాంగ్రెస్ విరుచుకు పడింది. తప్పుచేసినా ఎవరూ తప్పుకోరంటూ ఎన్డీయే సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఫాసిజాన్ని తలపిస్తోందని విరుచుకు పడింది.